'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా పిలువబడి, భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి (ఉత్తరప్రదేశ్) మొదటి మహిళా గవర్నరుగా పనిచేసిన సరోజినీనాయుడు పుట్టింది తెలుగునేలపైనే.
ఆమె తండ్రి శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన అఘోరనాథ చటోపాధ్యాయ. ఆయన హైదరాబాద్‌లో నిజాం కాలేజీని స్థాపించి, ఆ కళాశాలకు ప్రిన్స్‌పాల్‌గా చాలా కాలం పనిచేశారు. సరోజినీ దేవి తల్లి ప్రసిద్ధ కవయిత్రి వరద సుందరీ దేవి.
దేశ స్వాంత్య్రం కోసం, మహిళా వికాసం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం ఎంతగా కృషిచేశారో... సాహిత్యంలోనూ అంతటి విశేషకృషి చేశారు సరోజినీ దేవి. మొదటిసారిగా 1905లో ఆమె రాసిన కవితా సంపుటి 'గోల్డెన్ త్రెషోల్డ్' పేరిట ప్రచురింపబడింది. తద్వారా 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆ తర్వాత ఆమె రాసిన 'ది బర్ద్ ఆఫ్ టైం', 'ది బ్రోకెన్ వింగ్'... వంటి పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. 1908లో మూసీనదికి వరదలు సంభవించిన సమయంలో ఆమె చేపట్టిన సేవాకార్యక్రమానికి మెచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం సరోజినీ దేవికి ‘‘కైజార్ ఎ హిందూ’’ స్వర్ణ పతకాన్ని బహుకరించింది. ఆ రోజుల్లోనే కులాంతరవివాహం చేసుకుని కులవివక్షకు ఎదురునిలిచారు. మహిళా స్వేచ్ఛను చాటారు.